సినిమా రంగంలో నిర్మాతల క్షేమాన్ని కోరుకునే హీరోలు, క్రమశిక్షణతో నడుచుకునే హీరోలు కొందరే ఉన్నారు. వారిలో అందాల నటుడు శోభన్‌బాబు ఒకరు. ఎన్టీఆర్, ఎఎన్నార్‌ల తర్వాత అంతటి క్రమశిక్షణ ఉన్న నటుడు శోభన్‌బాబు. 35 సంవత్సరాల తన సినీ కెరీర్లో ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా అజాత శత్రువు అని పేరు తెచ్చుకున్నారు. అలాంటి శోభన్‌బాబు సినిమా వల్ల దర్శకుడు రేలంగి నరసింహారావుకి ఒక అన్యాయం జరిగింది. దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన రేలంగి... చంద్రమోహన్, ప్రభ జంటగా వచ్చిన ‘నేను మా ఆవిడ’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ సినిమా సూపర్‌హిట్ కావడంతో ఆయనకు వరసగా అవకాశాలు వచ్చాయి. కామెడీ సినిమాల డైరెక్టర్‌గా రేలంగికి మంచి పేరు వచ్చింది. తన కెరీర్లో 70 సినిమాలను డైరెక్ట్ చేసిన రేలంగి.. అందులో రాజేంద్రప్రసాద్‌తో 32, చంద్రమోహన్‌తో 18 సినిమాలు చేశారు. కామెడీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో రేలంగికి శోభన్‌బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చింది. అప్పుడు ఏం జరిగింది, శోభన్‌బాబు వల్ల రేలంగి ఏ విధంగా నష్టపోయారు అనే విషయం గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
‘నేను అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు శోభన్‌బాబుగారితో కలిసి పనిచేసిన ఒకే ఒక్క సినిమా ‘బలిపీఠం’. అప్పుడు ఆయనలో వున్న క్రమశిక్షణ, డెడికేషన్ చూశాను. నేను డైరెక్టర్ అయి కొన్ని సినిమాలు చేసి బిజీ అయిన తర్వాత ఒక నిర్మాత నుంచి నాకు ఫోన్ వచ్చింది. వాళ్ళ ఆఫీస్‌కి వెళ్లాను. ఏ చంద్రమోహన్తోనో, రాజేంద్రప్రసాద్తోనో సినిమా ఉంటుంది అనుకున్నాను. శోభన్‌బాబుగారు హీరోగా సినిమా అన్నారు. మొదట షాక్ అయ్యాను.. ఆ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. సినిమాకి సంబంధించి స్టోరీ డిస్కషన్స్ మొదలుపెట్టాం. నేను, సత్యానంద్ డిస్కషన్స్‌లో కూర్చునే వాళ్ళం. అలా ఓ వారం రోజులు సిట్టింగ్స్ జరిగాయి. ఎనిమిదో రోజు ఆ సినిమా ఆఫీస్ నుంచి కారు రాలేదు. ఆ తర్వాత నాలుగైదు రోజులు కూడా కారు రాలేదు. ఏం జరిగిందో తెలుసుకుందామని సత్యానంద్‌కి ఫోన్ చేశాను. ఆయన చెప్పిన మాట విని మరోసారి షాక్ అయ్యాను. ఈ సినిమా నుంచి మిమ్మల్ని తప్పించి వేరే డైరెక్టర్ని పిలిపించారు’ అని చెప్పారు. ఆ నిర్మాతలు నేనే కావాలని పిలిపించారు. హీరో ప్రమేయం లేకుండా డైరెక్టర్ని ఎవరూ మార్చరు. అప్పుడు శోభన్‌బాబుగారి మీద నాకు బాగా కోపం వచ్చింది. ఆ తర్వాత గురువుగారి సినిమాల షూటింగ్ జరిగేటపుడు సెట్స్‌కి వెళ్ళేవాడిని. అక్కడ శోభన్‌బాబుగారు ఉన్నా నేను విష్ చేసేవాడ్ని కాదు.
కొంతకాలం తర్వాత నిర్మాత శాఖమూరి రామచంద్రరావుగారు ఓ సినిమా కోసం నన్ను ఆఫీస్‌కి పిలిపించారు. శోభన్‌బాబుగారితో సినిమా చేస్తున్నాం. మీరే డైరెక్ట్ చెయ్యాలి అని చెప్పారు. అయితే ఈ విషయం శోభన్‌బాబుగారికి తెలుసా. నా డైరెక్షన్ అంటే ఆయన వద్దంటారు అన్నాను. అవన్నీ మేం చూసుకుంటాం. మీరు చేస్తారా, చెయ్యరా అన్నారు. శోభన్‌బాబుగారు లాంటి పెద్ద హీరోతో సినిమా చెయ్యను అని ఎలా అంటాను అన్నాను. ఒక సినిమా నుంచి నన్ను తప్పించి మరో సినిమా చెయ్యడానికి ఆయన ఎలా ఒప్పుకున్నారు అని ఆలోచించి ఆయన పర్సనల్ మేకప్‌మేన్ అప్పారావుకి ఫోన్ చేసి ఒకసారి శోభన్‌బాబుగారిని కలవాలి అని అడిగాను. మర్నాడు పది గంటలకు రమ్మని చెప్పారు. నేను వెళ్లాను. అప్పుడు శోభన్‌బాబుగారు చెప్పిన మాటలు విని ఆయన్ని ఎంత అపార్థం చేసుకున్నాను అని నన్ను నేనే తిట్టుకున్నాను. ‘మీ విషయంలో నాకు ఒక బాధ వుంది నరసింహారావుగారు. నేను చేసే సినిమా డైరెక్టర్ని ఇంతవరకు ఎప్పుడూ మార్చలేదు. కానీ, మీకు కామెడీ సినిమాల డైరెక్టర్‌గా మంచి పేరు వుంది. అయితే నా మార్కెట్‌కి తగ్గ సినిమా మీరు చెయ్యలేరు అని ఆ నిర్మాత అనుకున్నారు. తనకు బిజినెస్‌పరంగా పెద్ద ఆఫర్లు రావడం లేదు అని చెప్పారు. సినిమా ఎవరితో చెయ్యాలనేది నిర్మాత ఇష్టం కాబట్టి నేను ఏమీ అనలేదు. అప్పటి నుంచి నేను ఎంతో మనోవేదనకు గురవుతున్నాను. మళ్ళీ మీకు అవకాశం వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పారు. ‘ఆ సినిమా మిస్ అయిన తర్వాత అది మీ వల్లే జరిగిందని అపార్థం చేసుకున్నాను. క్షమించండి’ అన్నాను. ‘ఫర్వాలేదు. మీరు చక్కగా సినిమా చేసుకోండి’ అని చెప్పారు. అలా శోభన్‌బాబుగారు, జయప్రద, శారద, రాజేంద్రప్రసాద్, రజనిలతో ‘సంసారం’ చిత్రం చేశాను’ అంటూ వివరించారు రేలంగి నరసింహారావు.